Hyderabad | వెంగళరావునగర్, ఆగస్టు 3 : గాఢ నిద్రలో ఉన్న యువతి నైట్ ప్యాంట్‌ను ఓ కామాంధుడు కత్తిరించిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ బస్తీలో శనివారం రాత్రి ఇంట్లో యువతి నిద్రించింది. ఇంటి ప్రధాన తలుపు విరిగిపోయి ఉండటం వల్ల మూసివేయలేదు. ఓ గుర్తు తెలియని వ్యక్తి శనివారం రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి చొరబడి యువతి ప్యాంటును ప్రైవేట్ భాగాల వద్ద కత్తెరతో కత్తిరించాడు. తలుపు శబ్దం రావడంతో నిద్ర నుంచి యువతి మేల్కొంది. ఆమె ఇంటి తలుపు వద్ద తన ప్యాంటును కత్తిరించిన గుర్తు తెలియని వ్యక్తిని చూసి గట్టిగా కేకలు వేసింది. దాంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు.
యువతి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆ దుండగుడి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఎవరూ కనిపించలేదు. ఉదయం వారి ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీని పరిశీలించగా.. ఒక గుర్తు తెలియని వ్యక్తి వారి ఇంటి వైపు నుండి పరుగెత్తుకుంటూ వెళ్తున్నట్టు రికార్డ్ అయింది. తన ఫొటోలను తీసి ఉండవచ్చునని ఆమె అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.