Hyderabad | చిక్కడపల్లి, ఫిబ్రవరి 9 : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కడపల్లి ఏసీపి రమేష్ కుమార్, సిఐ రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చిక్కడపల్లిలో నివాసముండే ఎం శ్రీనివాస్ (50) అనే వ్యక్తి కార్లు కిరాయికి ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవలే కుమార్తె పెళ్లి చేశాడు. ఓ కుమారుడు కెనడాలో ఉన్నత చదువు అభ్యసించడానికి వెళ్లాడు. అయితే కూతురు అత్తారింటి నుంచి తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఈ విషయంలో గత కొద్ది రోజుల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. కుటుంబ సమస్యలు,ఆర్ధిక సమస్యల వల్ల జీవితంపై విరక్తి చెంది తన ఇంటికి దగ్గరలో ఉన్న పాపయ్య ఎస్టేట్‌లోనే భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.