సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) : మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక టీంలు తనిఖీలు చేపట్టాయి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,854 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 4,500 విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ పరీక్ష పూర్తయింది. ఇందులో 20శాతం బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అధికారులు అన్‌ఫిట్‌గా తేల్చేశారు. విద్యాసంస్థల బస్సులు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచనలు చేశారు.
* మోటార్ వాహనాల చట్టం ప్రకారం స్కూల్ బస్సు తప్పక పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. 1.రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), 2.వ్యాలీడ్ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్, 3.వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 4.పర్మిట్, 5.ట్యాక్స్ పేమెంట్ రశీదు(బకాయిలు లేకుండా), 6.పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, 7.డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్సు తప్పక వాహనంతో ఉండాలి.
* ప్రభుత్వ సూచనల మేరకు ఐదు రకాల వాహనాల వేగానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో విద్యాసంస్థల బస్సులు కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్‌కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాల్సి ఉంటుంది.
* తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం రూల్ నంబర్ 186జీ ప్రకారం తెలంగాణలో విద్యాసంస్థల బస్సులు పూర్తి పసుపు రంగులో ఉండాలి. ఆ బస్సుపై పెద్ద అక్షరాలతో స్కూల్ బస్సు అని రాయడం తప్పనిసరి.
* వాహనం డ్రైవర్ 60 సంవత్సరాలకు మించి ఉండరాదు. డ్రైవర్‌కు సంబంధించిన ఆరోగ్య వివరాలు బస్సులో అతికించాలి.
* కనీసం ఐదు సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
* వాహనంలో ఫిర్యాదుల పట్టికను ఏర్పాటు చేసి ఫిర్యాదులను ప్రతి నెలకు ఒకసారి పరిశీలించాలి.
* ప్రతి వాహనంలో అత్యవసర ద్వారం పెట్టాలి. పెద్ద అక్షరాలతో రాయించాలి. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి.
* ప్రతి బస్సులో విద్యార్థుల పేర్లు, ఇంటి చిరునామా, తరగతులు, దిగాల్సిన ప్రదేశం పేర్ల పట్టికతో పాటు రూట్ మ్యాప్ తప్పని సరి ఉండాలి.
* విద్యార్థులు బస్సును ఎక్కడం, దిగడం విషయాన్ని గ్రహించేందుకు కన్వెస్ట్ క్రాస్ అద్దాలుండాలి. ప్రతి బస్సులో కూర్చున్న విద్యార్థులు డ్రైవర్‌కు కన్పించేలా పెద్ద అద్దం పెట్టాలి.
* బస్సులు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు అరలు ఏర్పాటు చేయాలి.
* రవాణా శాఖ ఇచ్చే శిక్షణలో డ్రైవర్ పాల్గొనాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి విద్యార్థులచే రోడ్ సేఫ్టీ డేను నిర్వహించాలి.
స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. స్కూల్ బస్సుల వివరాలను ఆర్టీఏ కార్యాలయాల్లో అందజేయాలి. విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలి. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉండాల్సిందే. నిబంధనలు పాటించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. ఫిట్నెస్ లేకున్నా.. అర్హత లేని డ్రైవర్లను నియమించుకున్నా కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా సాంకేతికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంత్రికంగా చూస్తే ఇంజిన్, గేర్ బాక్సు, క్లచ్, స్టీరింగ్ పనితీరు సక్రమంగా ఉందో..? లేదో..? పరిశీలించుకోవాలి. వాటిలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ఎలక్ట్రికల్ విషయాల్లో బ్యాటరీ, వైపర్స్, రెండు వైపుల ఇండికేటర్లు పకడ్బందీగా పనిచేయాలి. యాజమాన్యాలు డ్రైవర్ వివరాలు పేరేంట్స్‌కు తెలిసేలా ఉంచాలి. ఫిట్నెస్ చేయని వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం.