బంజారాహిల్స్ : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను అటకాయించి డబ్బులు దోచుకున్న దొంగపై బంజారాహిల్స్ పోలీసులు దారిదోపిడి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని దర్భంగా జిల్లాకు చెందిన సంజయ్ దాస్ అనే యువకుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్-13 లోని శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి మందులు కొనుక్కునేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 లోని గౌరీ శంకర్ కాలనీకి తన స్నేహితుడు అజయ్ సదాతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
సాయిబాబా ఆలయం పక్క లైన్లోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి యాక్టివా బైక్ మీద వారి వద్దకు వచ్చాడు. వారిని అటకాయించి తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోకుండా జేబుల్లో చేయి పెట్టి నగదు లాక్కున్నాడు. అడ్డుకునేందుకు యత్నించగా సంజయ్ దాస్ మొహం మీద గట్టిగా గుద్ది అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడు సంజయ్ దాస్ గురువారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 309 (6) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.