బేగంపేట, ఏప్రిల్ 25: ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బేగంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి, ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, డీఐ మధులతో కలిసి నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు.
తిరుపతిలోని మధురానగర్‌కు చెందిన పాపాని క్రాంతికుమార్ (32) తొలుత చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. అయితే జల్సాలు, జూదానికి అలవాటుపడిన క్రాంతికుమార్ ఈజీగా డబ్బులు సంపాదించేందుకు చోరీలు చేయడం మొదలుపెట్టాడు. తిరుపతితో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. తర్వాత కూడా అలాగే దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హోండా సీబీ షైన్ మోటార్ బైక్‌ను చోరీ చేశాడు. ఆ బైక్‌పైనే బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు తిరుగుతూ వృద్ధులైన మహిళలు ఒంటరిగా ఉండే ఇళ్లను చోరీ చేయడం కోసం ఎంచుకున్నాడు. తలుపులు తెరిచి, మహిళలు ఒంటరిగా ఉన్న ఇళ్లలోకి చొరబడి, వాళ్ల మెడలోని బంగారు గొలుసులు తెంచుకుని ఉడాయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి మార్గ్‌లో ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న కమల అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకుని పరారయ్యాడు. సదరు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బేగంపేట పోలీసులు.. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని క్రాంతి కుమార్‌గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసిన 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.