మణికొండ, డిసెంబర్ 23 : రెండేండ్ల కాంగ్రెస్ సర్కారు పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలుకు నోచుకోలేకపోయిందని.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసి అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. మణికొండ సర్కిల్ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని అపార్టుమెంటు సంక్షేమ సంఘం ప్రతినిధులు చెక్కిలం వెంకట్, నాగరాజు నేతృత్వంలో పలువురు ఐటీ ప్రతినిధుల బృందం పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ ఆధ్వర్యంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత అధినేత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రపంచస్థాయిలో ఐటీ రంగానికి గుర్తింపు తీసుకువచ్చామన్నారు. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం ముత్యాలంపల్లి గ్రామంలో 4వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హుస్సేన్‌ను హరీశ్‌రావు అభినందించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్, భానుచందర్, శ్రీనివాస్, మహేశ్‌యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.