సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్రాక్టర్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ కార్యాలయానికి పిలిచారు. మంగళవారం హైడ్రా కా ర్యాలయంలో సుమారు 60మంది కాంట్రాక్టర్లు హైడ్రా కమిషనర్‌ను కలిసి టెండర్లలో అవకతవకలపై వివరించారు. రూ.65కోట్ల విలువైన 62 టెండర్లను వర్షాకాల అత్యవసర పనుల కోసం హైడ్రా ఆహ్వానించింది.
ఈ క్ర మంలో వీటిలో 44 టెండర్లను తెరిచామని.. ఇందులో 4 అర్హత సాధించలేదని తెలిపింది. మిగిలిన 40 టెండర్లలో 18 మంది అర్హత సా ధించారని చెప్పారు. అయితే మరో 22 టెం డర్ల దరఖాస్తులను పరిశీలించి ఖరారు చేస్తామని హైడ్రా అధికారులు చెప్పారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్లు హైడ్రా కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ వారిని పిలిచారు. టెండర్లు పూర్తి పారదర్శకంగా జరిగాయని, మీడియాకు వెళ్లి అనవసర రాద్ధాంతం ఎందుకు చేశారంటూ వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో జీహెచ్ఎంసీ హయాంలో వార్డులవారీగా పనులు కేటాయించేదని, ఇప్పుడు సర్కిళ్ల వారీగా చేస్తున్నారని, అయినా నాలుగు కంపెనీలకు ఒక్కొక్కరికి ఐదు కంటే ఎక్కువ పనులు వచ్చాయ ని, వీటిపై తాము మాట్లాడినట్లు కాంట్రాక్టర్లు రంగనాథ్‌కు చెప్పారు. తాము ఈ వ్యవహారంపై ఇన్వార్డులోనైనా తమ అభ్యర్థన ఇచ్చి వెళ్దామంటే అక్కడ నుంచి బయటకు పంపించారని, అందుకే తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని, అయినా మీడియాలో తాము మాట్లాడిందంతా వాస్తవమేనంటూ కాంట్రాక్టర్లు రంగనాథ్‌కు చెప్పారు. అంతేకాకుండా అర్ధరాత్రి రెండుగంటలకు టెండర్లు ఓపెన్ చేయడమేంటంటూ వారు ప్రశ్నించగా ఈ విషయంలో మీరు ప్రశ్నించవద్దని, మేం సర్వీ స్ చేస్తున్నాం కాబట్టి ఏ సమయంలోనైనా టెండర్లు ఓపెన్ చేస్తామంటూ ఆయన చాలా ఆగ్రహంగా చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే హైడ్రా ఖరారు చేసిన టెండర్లకు సం బంధించి ఒక్కో కంపెనీకి ఐదు నుంచి ఆరు పనులు కేటాయించడంతో ఇందులో వాహనాలు సమకూర్చుకోవడం కంటే లేబర్‌ను సమకూర్చుకోవడం చాలా కష్టమైన పనిగా కాంట్రాక్టర్లు చెప్పారు. కొందరు తమ అర్హతలు ఎక్స్పైర్ అయి న తర్వాత కూడా వారికి పనులు కేటాయించారని, దీనిపై ఎవరెవరి దగ్గర ఏం సమాచారం ఉందో ఇన్‌వార్డులో ఇవ్వాలంటూ రం గనాథ్ కాంట్రాక్టర్లకు సూచించారు. అన్నీ చూసిన ఆలోచన చేద్దామంటూ హైడ్రా కమిషనర్ చెప్పడంతో కాంట్రాక్టర్లు ప్రస్తుతం జరిగిన టెండర్లలో అవకతవకలపై సాక్ష్యాలతో ఇన్‌వార్డులో ఇవ్వనున్నట్లు తెలిసింది.