సిటీబ్యూరో: నార్త్ సిటీ మెట్రో నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీపై హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టిన నేపథ్యంలో… మెట్రో నిర్మాణ ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో భూసార పరీక్షలతో భౌగోళిక అంశాలను పరిశీలిస్తున్నారు. పిల్లర్ల నిర్మాణం, మెట్రో స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాల్లో భూసార పరీక్ష కీలకం కానున్నది. ఇప్పటికే నార్త్ సిటీలోని పలు ప్రాంతాల్లో బోరింగ్ విధానంలో మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫేస్-2 పార్ట్ -బీ విస్తరణలో భాగంగా నార్త్ సిటీలో దాదాపు 45 కిలోమీటర్ల పొడవైన మెట్రో నిర్మాణానికి హెచ్ఏఎంఎల్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.
ఇందులో జేబీఎస్ నుంచి సుచిత్ర వైపు, మరొక లైన్ శామీర్పేట వరకు మరో మార్గం నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించగా, సుచిత్ర మార్గంలో పలు ప్రాంతాల్లో భూసార పరీక్ష ప్రక్రియలు జరుగుతున్నాయి. దాదాపు 15-25 అడుగుల లోతున నేల స్వభావాన్ని తెలుసుకునేందుకు నమూనాలను సేకరిస్తున్నారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా భూమి లోపలి వరకు రంధ్రాలు చేసి అడుగు భాగంలో ఉండే మట్టిని సేకరిస్తారు. దీని ద్వారా మట్టి నాణ్యత, రాతి పొరలతో పాటు, నేల స్వభావం ఆధారంగా ప్రాజెక్టును పరిశీలించనున్నారు. దీనికి కనీసం నెలన్నర సమయం పట్టే అవకాశం ఉండగా… ప్రస్తుతం మేడ్చల్ మార్గంలో గుండ్లపోచంపల్లి, కొంపల్లి వంటి మార్గాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు.