కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 27: అతివేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన కారు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరు ప్రాంత షిఫ్ట్ కారు (టీ ఎస్ 15 ఎఫ్ ఎఫ్ 7542) బుధవారం అర్ధరాత్రి సమయంలో కూకట్పల్లి నుంచి పటాన్ చెరు వైపుకు వెళుతుండగా అతి వేగంతో జాతీయ రహదారిపై కేపీహెచ్‌బీ కాలనీలో 750వ నంబర్ పిల్లర్‌ను షిఫ్ట్ కారు ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు ప్రస్తుతం ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో షిఫ్ట్ కారును వెనకాల వచ్చిన క్రెటా కారు ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. దీనిపై బాధితుల నుంచి ఎటువంటి పిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.