బన్సీలాల్‌పేట, మే 20: గుర్తు తెలియని మృతదేహాలను తీసుకొచ్చి మార్చూరీలో పెట్టడంతో వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారానికి నగర శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా మార్చురీలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గాంధీ దవాఖాన మార్చురీలో నుంచి వస్తున్న కుళ్లిపోయిన మృతదేహాల దుర్వాసన భరించలేకపోతున్నామని పద్మారావునగర్‌లోని అభినవనగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆయన ‘గాంధీ’ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావును కలిశారు. సమస్యపై శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ.. పోలీసులు గుర్తు తెలియని మృతదేహాలను తీసుకువచ్చి, మార్చురీలో భద్రపరుస్తారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని మూడు రోజుల పాటు మార్చురీలోనే భద్రపరచాల్సి ఉంటుందన్నారు. అప్పటికే అవి కుళ్లిపోయిన స్థితిలో ఉంటాయని, వాటి నుంచి దుర్వాసన వస్తుందన్నారు.
కుళ్లిన మృతదేహాలను ఇక్కడ పెట్టవద్దని పలుమార్లు తాము ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. గాంధీ దవాఖానలోని మార్చురీకి ప్రతిరోజు 15 నుంచి 20 మెడికో లీగల్ కేసులకు సంబంధించిన మృతదేహాలు వస్తుంటాయన్నారు. అదేరోజు లేదా మరుసటి రోజు వాటిని ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, అంత్యక్రియల కోసం మృతుల బంధువులకు అప్పగిస్తారని తెలిపారు. అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు చోట్ల మార్చురీలను ఏర్పాటు చేసి, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాను సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి పోరాడుతామని తెలిపారు. బీజేపీ నాయకులు గుంటి సత్యనారాయణ, చంద్రపాల్‌రెడ్డి, రాజీవ్ దేశ్‌పాండే, హరినాథ్నాయి, శివలింగం, ఈశ్వర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.