సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు విస్తరణ, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణాలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి మంచి అవకాశమని జేఎన్టీయూ సివిల్ విభాగానికి చెందిన హెచ్‌వోడి ప్రొఫెసర్ డీన్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ మెగా ప్రాజెక్టుతో నగరంలో ట్రాన్స్‌పోర్టు కనెక్టివిటీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ వంటి పలు జిల్లాల అభివృద్ధికి దోహదపడుతుంది. మెట్రో విస్తరణ నేపథ్యంలో ప్రొఫెసర్ డీన్కుమార్తో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, ఫ్లె ఓవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ నూతన ప్రాజెక్టు అందరి అవసరాలు తీర్చుతుందనడంలో సందేహం లేదు. దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, వంతెనల వంటి నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
హైదరాబాద్ నలుమూలలూ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, పలు ప్రధాన కూడళ్లలో వంతెనల నిర్మాణాల ఫలితంగా చట్టుపక్కల నుంచి నగరంలోకి ప్రవేశించడానికి ప్రజలకు ఎంతో సులభంగా ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉండే సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి జిల్లాలు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల నగరంలో ప్రజల జీవన విధానం బాగా మెరుగుపడుతుంది. పరిశ్రమలు వస్తాయి. ఐటీ సంస్థలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది.