హైదరాబాద్ : కదులుతున్న ఆర్టీసీ బస్సు(RTC Bus) ను ఎక్కిన ప్రయాణికుడి ( Passenger ) కి గుండెపోటురావడంతో అతడికి మహిళా కండక్డర్ సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలను కాపాడారు. శనివారం జీడిమెట్ల ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు బయలు దేరింది.
ఐడీపీఎల్ సిగ్నల్ సమీపంలోకి రాగానే మురళీ కృష్ణ(67) అనే వృద్ధుడు రన్నింగ్ బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. వెంటనే అతడికి గుండె నొప్పి వస్తోందంటూ బస్సులోనే కుప్పకూలిపోయాడు. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ అంజలి (Conductor Anjali) బస్సు ఆపించి చాతిపై ఆమె సీపీఆర్ చేశారు. ఆమెతో పాటు మరో ప్రయాణికుడు సహాయం చేయడంతో కొద్దిసేపటికి వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు.
ప్రయాణికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్‌లో బాధితున్ని స్థానిక సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీపీఆర్ తో ప్రాణాలు కాపాడిన మహిళాకండక్టర్ తో పాటు తోటి ప్రయాణికుడిని వైద్యులు, జీడిమెట్ల బస్ డిపో మేనేజర్ ఆంజనేయులు, ప్రయాణికులు అభినందించారు.