Hyderabad | బండ్లగూడ, జూన్ 10 : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ జనచైతన్య కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. తనను ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కక్షతోనే మాజీ డ్రైవర్.. వృద్ధ దంపతులను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ షకీల్ సల్మాన్‌తో పాటు అతనితో వచ్చిన మహమ్మద్ ముజీవుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈనెల 5న జనచైతన్య కాలనీలోని ఆర్బిస్ రెసిడెన్సీలోని ఫ్లాట్-502లో నివసిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జనరల్ మేనేజర్ షేక్ అబ్దుల్లా(70), ఆయన భార్య మాజీ లెక్చరర్ రిజ్వానా(65)లు హత్యకు గురైన విషయం తెలిసిందే. గతంలో రెడ్‌హిల్స్‌లో నివాసమున్నవారు ఇటీవల బుద్వేల్ జనచైతన్య కాలనీలో ఫ్లాట్ కొనుగోలుచేసి అందులోనే ఉంటున్నారు. గతంలో వారివద్ద మహమ్మద్ షకీల్ సల్మాన్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని 8 నెలల క్రితం ఉద్యోగంలో నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఉపాధి దొరకక జులాయిగా తిరుగుతున్నాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేశారనే కోపంతో వారిపై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో తన స్నేహితుడు మహమ్మద్ ముజీబుద్దీన్ దగ్గర సల్మాన్ రూ.40వేలు తీసుకున్నారు. డబ్బులు ఇస్తానని ముజీబుద్దీన్‌ను తీసుకుని ఈ నెల 4న రెడ్‌హిల్స్‌కు వెళ్లగా.. షేక్ అబ్దుల్లా బుద్వేల్‌కు షిఫ్ట్ అయ్యారని తెలిసింది. వెంటనే జనచైతన్య కాలనీకి వచ్చి షేక్ అబ్దుల్లా ఇంటిని చూసి లోనికి ఎలా వెళ్లాలని రెక్కీ నిర్వహించారు. ఈనెల 5న సాయంత్రం 5 గంటల సమయంలో షకీల్ సల్మాన్ బుర్ఖా ధరించి, ముజీబుద్దీన్ మాస్క్ ధరించి వాచ్‌మన్ రాజేశ్ వద్దకు వెళ్లి పొలం వద్ద నుంచి అలీ వచ్చారని షేక్ అబ్దుల్లాకు సమాచారం ఇచ్చారు. షేక్ అబ్దుల్లా క్లియరెన్స్ ఇవ్వడంతో వారిద్దరు లోనికి వెళ్లారు. సల్మాన్ తనవెంట తెచ్చుకున్న కత్తితో షేక్ అబ్దుల్లాను పొడిచాడు. ఈ హఠాత్తు పరిణామాన్ని చూసిన ముజీబుద్దీన్ అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అడ్డు వచ్చిన భార్య రిజ్వానాను కూడా కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. నిందితుడు సల్మాన్ కొద్దిసేపు అక్కడే ఉండి మృతుడి జేబులో నుంచి రూ.600 తీసుకొని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. ప్రధాన నిందితుడు సన్మాన్తోపాటు అతడితో వచ్చిన ముజీబుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఏసీపీ తులా శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు క్యాస్ట్రో, ప్రశాంత్, సీసీఎస్, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు.