Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల వద్ద దరఖాస్తుల కోసం జనాలు బారులు తీరుతున్నారు. అధికారులు అక్కడికి చేరుకుని, దరఖాస్తులను పంపిణీ చేసే సమయంలో తొక్కిసలాట జరుగుతోంది. దీంతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
హైదరాబాద్ పరిధిలోని సులేమాన్ నగర్‌లోని ఓ కేంద్రం వద్ద దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. దరఖాస్తులు అందుకునేందుకు జనాలు ఎగబడగా.. తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో సులేమాన్ నగర్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ అధికారి మసూద్ ఉర్ రెహ్మాన్‌ను జనాలు కింద పడేశారు. దీంతో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. అప్రమత్తమైన తోటి సిబ్బంది మసూద్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మసూద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్‌లోని పలు కేంద్రాల వద్ద ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వాపోయారు. జనాలు ఒకేసారి ఎగబడడంతో తమకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచాలని ఫీల్డ్ అధికారులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.