సిటీబ్యూరో, మే 12(నమస్తే తెలంగాణ): నగరంలో వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో సరికొత్త మోసం వెలుగుచూస్తోంది. కస్టమర్లు డ్రా చేసే డబ్బు బయటకు రాకుండా ప్యానల్ యాక్సెస్‌లో ఇరుక్కునేలా టేప్ అంటించి.. కస్టమర్లు బయటకు వెళ్లాక నకిలీ కీస్‌తో యాక్సెస్ మిషన్ తెరిచి అందులోని డబ్బును దొంగ చోరీ చేసి ఉడాయించాడు. కస్టమర్లకు ఏటీఎం నుంచి లావాదేవీలు జరిగినట్లు మెసేజ్‌లు వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం డబ్బులు తీసుకోలేదు. ఈ విషయంలో బ్యాంకులను సంప్రదిస్తే మీరు డబ్బులు తీసుకున్నారంటూ సమాధానం వస్తోంది. కానీ ఖాతాదారులకు ఏటీఎం నుంచి మాత్రం డబ్బులు రావడం లేదు. దీంట్లో ఏదో కిటుకు ఉందని గ్రహించిన కొందరు కస్టమర్లు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు బ్యాంక్ మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఏటీఎంల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ చూసిన బ్యాంక్ సిబ్బంది కస్టమర్లు చెబుతున్న సమయానికి అక్కడ ఏదో గందరగోళం జరిగినట్లుగా గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు.
యూపీ, బీహార్, ముంబైకు చెందిన కొందరు యువకులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తిరుమలగిరిలో జరిగిన మోసంలో పట్టుబడ్డ యువకులు ముంబైలో ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. గతనెల 16న ఎస్ఆర్నగర్లోని ఓ బ్యాంక్ ఏటీఎంలో తాము డబ్బులు తీసుకోకుండానే డబ్బులు డ్రా చేసినట్లుగా మెసేజ్ రావడంతో కస్టమర్లు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై బ్యాంక్ డిప్యూటీ బ్రాంచ్‌హెడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు డ్రా చేసిన వ్యక్తి నగదు పంపిణీ స్లాట్‌లో టేప్ అంటించి డబ్బు బయటకు రాకుండా అడ్డుకున్నట్లు వెల్లడైంది. మారుతాళం చెవులతో ఏటీఎం ప్యానల్ యాక్సెస్‌ను తెరిచి అక్కడ చిక్కుకుని ఇరుక్కుపోయిన డబ్బును కాజేస్తున్నట్లుగా ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. 3న తిరుమలగిరి పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు.