Hyderabad | బంజారాహిల్స్, మే 29 : కొడుకు చదువు గురించి వాకబు చేసే సాకుతో మహిళకు ఫోన్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..యూసుఫ్‌గూడ సమీపంలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న మహిళ(39) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె కొడుకు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో చదువుతున్నాడు. అతడితో పాటు చదువుకునే విద్యార్థి తండ్రి మురళి అప్పుడప్పుడు ఆమెకు ఫోన్లు చేస్తూ కొడుకు చదువు గురించి వాకబు చేస్తుండేవాడు.
కాగా ఇటీవల అతడి ప్రవర్తనలో తేడా రావడంతో పాటు వాట్సప్ కాల్స్ చేస్తూ ఆమెను విసిగించడం ప్రారంభించాడు. దీంతో అతడి ఫోన్ కాల్స్‌ను ఎత్తడం మానేసింది. కాగా వారం రోజుల క్రితం బోటిక్ నుంచి ఇంటికి వస్తుండగా అడ్డగించిన మురళి తన నెంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశావంటూ నిలదీశాడు. హద్దుమీరి ప్రవర్తిస్తున్నావంటూ హెచ్చరించి ఇంటికి వెళ్లిపోయింది. కాగా అతడి పద్దతి మార్చుకోకపోవడంతో పాటు ప్రేమిస్తున్నానంటూ మెసేజ్‌లు పంపించడం ప్రారంభించాడు. దీంతో జరిగిన విషయాన్ని గురించి తన భర్తకు చెప్పిన బాధిత మహిళ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.