బంజారాహిల్స్,జనవరి 2: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మద్యన ప్రారంభమయిన గొడవను అపేందుకు ప్రయత్నించిన మూడో వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్న మనోజ్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ ఆఫీసులో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. గురువారం మద్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని ఎస్వీ వైన్స్ పర్మిట్ రూమ్‌లో మనోజ్ మద్యం సేవిస్తున్నాడు.
అదే సమయంలో మాదాపూర్ బస్తీలో నివాసం ఉంటున్న రాకేష్(30) అనే ఆటోడ్రైవర్ కూడా పక్కనే మద్యం సేవించి ఓ వ్యక్తితో గొడవ పడుతున్నాడు. వారిద్దరి మద్యన గొడవ తీవ్రం కావడంతో మనోజ్ అడ్డుకున్నాడు. దీంతో మనోజ్‌ను నెట్టేయడంతో పాటు బాహాబాహీకి దిగాడు. రాకేష్ అక్కడి నుంచి సమీపంలోని తన ఇంటికి వెళ్లి కొడవలి తీసుకువచ్చి మనోజ్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలయిన మనోజ్‌ను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో బీఎన్ఎస్ 109, 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు రాకేష్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.