Hyderabad | బంజారాహిల్స్, మార్చి 20 : దుబాయిలో డాన్సర్ గా పని చేశావు అన్న విషయం అందరికి చెప్పి పరువు తీస్తానని, తనతో దిగిన ఫొటోలు బయటపెడతానంటూ ఓ మహిళను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో నివాసముంటున్న వివాహిత (38) ఆరేళ్ల క్రితం దుబాయ్ వెళ్లింది.
అక్కడ రెండేళ్ల పాటు ఒక పబ్ లో డాన్సర్ గా పని చేసింది. ఆ సమయంలో పరిచయమైన నౌషాద్ అబూబకర్ అనే వ్యక్తి కొంతకాలం స్నేహంగా ఉన్నాడు. ఆమెతో బలవంతంగా ఫొటోలు దిగి తన వద్ద ఉంచుకున్నాడు. కాగా రెండేళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో వివాహితను వేధించడంతోపాటు తనతో దిగిన ఫొటోలు ఆమె భర్తకి పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆందోళనకు గురైన వివాహిత ఓ సారి దుబాయ్ వెళ్లి అతడిని కలిసింది.
తన ఫొటోలు వీడియోలు డిలీట్ చేయాలని గొడవ పెట్టుకుని వాటిని డిలీట్ చేయించింది. ఇదిలా ఉండగా ఇటీవల ఇండియాకు వచ్చిన అబూబకర్ మహిళకు ఫోన్ చేసి భర్తను పిల్లలను వదిలేసి తనతో రావాలని, ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. తన మాట వినకపోతే తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు నౌషాద్ అబూబకర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.