మలక్‌పేట, మార్చి 10: మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త, అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య ముఖంపై పారతో దాడిచేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్, కృష్ణవేణి దంపతులు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి.. శాలివాహననగర్‌లోని నారాయణి గోసేవా సదన్ ఆవరణలో గుడిసెల్లో నివాసముంటున్నారు. వెంకటేశ్ కూలీ పనులు చేస్తుండగా, కృష్ణవేణి గోశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. అయితే, మద్యానికి బానిసైన వెంకటేశ్ నిత్యం తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు.
కాగా, శనివారం రాత్రి తాగివచ్చిన వెంకటేశ్ భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య ముఖంపై పారతో దాడిచేసి, గొంతు నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వాచ్‌మన్ కనిపించకపోవడంతో గోశాల నిర్వాహకులు గుడిసె వద్దకు వెళ్లి చూడగా.. కృష్ణవేణి రక్తపు మడుగులో విగత జీవిలా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.