Hyderabad | వెంగళరావునగర్, మార్చి 13 : బంగారంలాంటి భార్య, రత్నాల్లాంటి బిడ్డలుండగా అతని మనస్సు మరో యువతిపై మళ్లింది. తనకింకా పెళ్లి కాలేదని ఓ యువతికి దగ్గరై మాయమాటలతో ఆమెని లోబర్చుకున్నాడు. శారీరకంగా యువతిని వాడేసుకుని మోజు తీరాక తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజం బయటపెట్టాడు. పెండ్లి అంటూ చేసుకుంటే అది నీతోనే.. నిన్ను విడిచి ఉండలేనని ప్రియురాలు తన ప్రియుడితో చెప్పింది. తనను మర్చిపోవాలని ప్రియుడు చెప్పాడు. అది తన వల్లకాదని చెప్పిన ప్రియురాలిపై దాడి చేశాడు ఆ ప్రియుడు. మనసిచ్చిన పాపానికి అతని భార్యతో సహా అందరిచే శాపనార్థాలతో పాటు.. దెబ్బలు తినాల్సి వచ్చింది ప్రేమించిన పాపానికి ఆ యువతి. ఒంటికైన గాయాలు కొంత కాలానికి మానుతాయ్ గాని.. తన మనసుని ప్రియుడు గాయపర్చాడని.. తనను మోసం చేసిన ప్రియుడిపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.
పోలీసుల కథనం ప్రకారం బాపునగర్‌లో నివాసముండే శ్యామ్ లాల్ (30) బోటిక్ షాపు నిర్వహిస్తుంటాడు. మధురానగర్‌లో మూడు నెలల క్రితం అద్దె ఇల్లు వెతికే క్రమంలో అతనికి ఓ యువతితో పరిచయమేర్పడింది. శ్యామ్ లాల్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. తనకు పెళ్లి కాలేదని ఆమెతో అబద్ధం చెప్పాడు. రెండు నెలల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమించానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరకంగా సంబంధాన్ని కొనసాగించాడు. పెండ్లి విషయమై ప్రియుడ్ని పట్టుకుని గట్టిగా నిలదీసేసరికి.. అతను కోపంతో విదుల్చుకుని ఆమెని కొట్టి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అతని భార్యకు ఆమెకు ఫోన్ చేసింది. నా భర్త ఇంటికి రావడం లేదని.. అతను ఎక్కడికైనా వెళ్తే నిన్ను వదలనంటూ అతని భార్య ఫోన్ చేసి యువతిని బెదిరింపులకు గురిచేసింది. ప్రేమించి పెండ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడితోనే తనకు పెండ్లి జరిపించాలని పోలీసుల్ని యువతి వేడుకుంటుంది. శ్యామ్ లాల్‌తో పెండ్లి జరగకపోతే తనకు ఇక చావే గతి అని కన్నీటి పర్యంతమైంది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.