ఖైరతాబాద్, డిసెంబర్ 23 : అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, ఆమె భర్త జీహెచ్ఎంసీలో నమోదై ఉన్న రహదారినే మింగేశారని గండిపేటకు చెందిన న్యాయవాది డాక్టర్ వంశీధర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1960లో తన తాత బి. వెంకయ్య రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్లు 35, 38, 39లోని మూడు ఎకరాల 28గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారన్నారు. అందులో కొంత భాగం విక్రయించగా, 2 ఎకరాల 16 గుంటల భూమిని తన వద్ద ఉంచుకున్నాడని, 1999లో రిజిస్ట్రర్డ్ విల్ ద్వారా ఆ భూములన్నీ వారసత్వంగా తన కుమారులకు బదిలీ చేశారన్నారు.
ఈ భూములకు వారసులు గ్రామపంచాయతీ నుంచి లే అవుట్ అనుమతి పొంది, 2004లో పార్టిషన్ డీడ్‌ను నమోదు చేశారని తెలిపారు. తదానంతరం కొంత భాగాన్ని రియల్టర్లకు విక్రయించగా, మిగిలిన తమకు చెందిన భాగంలో నుంచే గండిపేట మెయిన్ రోడ్డు నుంచి ప్లాట్ల మధ్య రోడ్డు కోసం బల్దియాకు ఉచితంగా స్థలాన్ని అందజేశారన్నారు. ప్రస్తుతం 20కిపైగా ఇండ్లకు, ప్లాట్లకు రాకపోకల కోసం ప్రధాన మార్గంగా ఉందన్నారు. విద్యుత్ స్తంభాలు, రోడ్లు, సీవరేజీ, డ్రైనేజీలు లైన్లతో అన్ని రకాలుగా సదుపాయాలతో కలిగి ఉన్నాయన్నారు.
తాజాగా కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ గోపాల సునీత, ఆమె భర్త గోపాల గణేశ్ ఆ రోడ్డునే చెరబట్టారని, తప్పుడు పత్రాలు సృష్టించి రోడ్డును తమ పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. స్థానికంగా ఉన్న వారు జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు, తహసీల్దార్ తదితరులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. సబ్ రిజిస్ట్రార్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా, అక్కడ తమకు ఎలాంటి రోడ్డు లేనట్లుగా డాక్యుమెంట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారన్నారు. వారిపై సదరు మాజీ కౌన్సిలర్, ఆమె భర్త రాజకీయంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని, స్థానికులు నిలదీస్తే వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి కబ్జా నుంచి విడిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాఘవేందర్ కుమార్, ప్రసన్న కమలా, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.