సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కదిరవన్ పలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డీఆర్వో వెంకటాచారితో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి 390 దరఖాస్తులు వచ్చాయని అందులో గృహనిర్మాణ శాఖ 297, రెవెన్యూ 54, ఇతర శాఖల నుంచి 39 ఉన్నాయని వెల్లడించారు. అనంతరం సీఎం ప్రజాదర్బార్, వాట్సాప్ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను ఈనెల 18వ తేదీలోపు తప్పనిసరిగా పరిష్కరించి వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ డాక్టర్ సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, డీఈవో రోహిణి, దివ్యాంగుల శాఖ ఏడీ రాజేందర్సంక్షేమాధికారులు ఆశన్న, కోటాజీ, ఇలియాస్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీలో 179 ఆర్జీలు
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 47 విన్నపాలు, ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఆరు జోన్లలో మొత్తం 132 ఆర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. కూకట్పల్లి జోన్లో 67, ఎల్భీనగర్ జోన్లో 14, సికింద్రాబాద్ జోన్లో 25, శేరిలింగంపల్లి జోన్లో 18, చార్మినార్ జోన్లో 7, ఖైరతాబాద్ జోన్లో ఒక ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సుభద్రాదేవి, సత్యనారాయణ, సీఈ రత్నాకర్, హౌసింగ్ సీఈ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.
హైడ్రా ప్రజావాణికి 46 ఫిర్యాదులు
చెరువులు, నాలాలు, ప్రభుత్వభూముల కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలపై వివిధ ప్రాంతాల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో46 ఫిర్యాదులొచ్చాయి. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం చిన్నచెర్లపల్లిలోని వెంకటరెడ్డి కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురవుతున్నదని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మండలంలోని కండ్లకోయ గ్రామంలో ప్రభుత్వ భూమి డంపింగ్‌యార్డుగా మారిపోయిందని, ప్రభుత్వకార్యాలయాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
మేడ్చల్‌లో 107 ఫిర్యాదులు..
మేడ్చల్, డిసెంబర్15(నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 107 ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులు వివిధ విభాగాల జిల్లా అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులను అదనపు కలెక్టర్‌తో పాటు లా ఆఫీసర్ చంద్రావతి స్వీకరించి పరిశీలించారు.