మలక్పేట, జనవరి 12: పారిశుధ్యం నిర్వహిస్తున్న తమ తల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో పారిపోయిన వాహనదారుడిని పట్టుకొని శిక్షించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చాదర్ఘాట్ మూసానగర్లో నివసించే యాదగిరికి భార్య ఇందిర, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబంలో యాదగిరి పక్షవాతంతో మంచానపడటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేసే ఇందిర తన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించేది.
కాగా, గతేడాది డిసెంబర్ 10న కోఠిలో పారిశుధ్యం నిర్వహిస్తున్న ఇందిరను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఇందిర అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో కుటుంబసభ్యులు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలరోజులు గడిచినా పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకోకపోగా,పైగా అక్కడ ఉన్న 16 సీసీ కెమెరాలు పనిచేయడం లేదని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు. తల్లి మృతికి కారణమైన వాహనదారుడి పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.తల్లి మరణంతో తమకు పూటగడవడం కష్టంగా మారిందని, ఇంట్లో సంపాదించే వారు లేక పస్తులు ఉంటున్నామని, ఇరుగు, పొరుగువారు మానవత్వంతో పెట్టే ఆహారంతోనే కాలం వెళ్ల దీస్తున్నామని వారు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. ఆర్థిక సాయాన్ని అందించాలనుకున్న దాతలు 73867 56966 నంబర్లో సంప్రదించాలని వారు కోరుతున్నారు.