Hyderabad | హైదరాబాద్ : హయత్నగర్లో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి, తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్లోని నేతాజీ కాలనీకి చెందిన సాయి సంజయ్ అనే విద్యార్థి శ్రీ చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో నోట్ బుక్ కొనుక్కుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత సంజయ్ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కాలనీ మొత్తం వెతికారు. అయినా ఎక్కడా సంజయ్ ఆచూకీ లభించలేదు. దాంతో వెంటనే హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ కెమెరాలో సంజయ్ నడుచుకుంటూ వెళ్తున్నట్లు రికార్డయింది. దాని ఆధారంగా సంజయ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.