సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్‌లో మెళకువలు చెబుతామంటూ సైబర్ నేరాల ముఠా ఓ ఐటీ ఉద్యోగిని నుంచి 1.36 కోట్లు దోచుకున్నారు. నగరంలో కమలానగర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సెప్టెంబర్ నెలలో ఫేస్బుక్లో ఒక లింక్‌ను క్లిక్ చేసింది. బీఓబీక్యాప్స్ ఇన్ఫర్మేషన్ లర్నింగ్ గ్రూప్స్(ఎఫ్516) పేరుతో ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌కు నెంబర్ యాడ్ అయ్యింది. అందులో ఇద్దరు సైబర్ దొంగలు మారు పేర్లతో వేర్వేరుగా మాట్లాడారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ఏ స్టాక్స్ ఎలాంటి లాభాలొస్తాయనే విషయంలో మెళకువలు చెబుతామంటూ యూజర్ ఐడీ ఇచ్చారు. దీంతో బీవోబీక్యాప్స్క్యూల్బి-ఇన్.కామ్ పేరుతో ఉన్న లింక్‌ను పంపించి అందులో ఖాతాను క్రియేట్ చేసుకొని రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టింది.
దీంతో కొన్ని లాభాలు వచ్చాయి, అందులో నుంచి వెయ్యి రూపాయలు విత్ డ్రా చేసుకుంది. దీంతో సదరు ఐటీ ఉద్యోగినికి ఇదంతా నమ్మకమైన వ్యవహారమే అనిపించింది. వారం రోజుల తరువాత ‘మీకు ట్రూ అల్టా బయో ఎనర్జీ ఐపీఓ ఓపెన్ అయ్యింది, మీరు వెంటనే ఇన్వెస్ట్ చేయండి, అందులో మేం కూడా కొంత ఫండింగ్ చేస్తాం’ అంటూ నమ్మించారు. దీంతో రూ. 53.96 లక్షలు, రూ.68 లక్షలు మరోసారి ఇలా రెండు సార్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో స్క్రీన్‌పై రూ. 2 కోట్ల లాభం కన్పించింది. అందులో నుంచి కొంత డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఆమె ప్రయత్నించింది.
తమకు రూ.31 లక్షల కమిషన్ చెల్లించిన తరువాత డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని సైబర్‌నేరగాళ్లు సూచించారు. అకౌంట్లో ఉన్న డబ్బులో మినహాయించుకొని తమకు రావాల్సింది ఇవ్వాలంటూ బాధితురాలు కోరగా అందుకు వారు నిరాకరించారు. కాగా అదే సమయంలో జనరల్ అట్లాంటిక్(బీఎఫ్04) అనే స్టాక్ ట్రేడింగ్ గ్రూప్‌లోను బాధితురాలు ఇన్వెస్ట్ చేసింది. రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడంతో కొంత లాభం రావడంతో వెంటనే రూ. 34 లక్షలు పెట్టుబడి పెట్టింది. అందులో కొంత డబ్బు విత్ డ్రా చేసుకోగా మరికొంత డబ్బు అందులోనే ఉంది.
కాగా రుబికాన్ రిసర్చ్ లిమిటెడ్ ఐపీఓ షేర్స్ ఉన్నాయని వాటిలో పెట్టుబడి పెట్టాలంటూ మరికొంత ఇన్వెస్ట్ చేయించారు. ఇక్కడ కూడా తన డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిచడంతో సైబర్‌నేరగాళ్లు నిరాకరించారు. ఇలా రెండు ఫ్లాట్ ఫామ్స్‌పై రూ. 1.55 కోట్లు పెట్టుబడి పెట్టడంతో రూ. 19 లక్షలు బాధితురాలు తిరిగి రాబట్టుకోగా రూ. 1.36 కోట్లు సైబర్‌నేరగాళ్లు కాజేశారు. దీనిపై బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.