సిటీబ్యూరో, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు పోలీస్స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల హద్దులు అడ్డు కాకూడదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు జీరో డిలే విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన సూచించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో సీపీ సజ్జనార్ అధ్యక్షతన మూడు కమిషనరేట్ల అధికారుల కీలక సమన్వయ సమావేశం జరిగింది.
ఈభేటీలో నగర భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నేరస్తుల కదలికలపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నేరస్తులు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని, పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో కిందిస్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు సీపీలు సూచించారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ పరిధి అన్నది చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలని, ఇంటిలిజెన్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరస్పరం పంచుకోవాలని పో లీసు కమిషనర్లు అధికారులకు చెప్పారు. రౌడీషీటర్లు, నేరస్తులు తరుచూ తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడి జరగాలని సూచించారు.
ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
నేరాలతోపాటు నగరంలో ట్రాఫిక్ నిర్వహణపైనా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నగరంలోకి వచ్చే భారీ వాహనాల నో ఎంట్రీ సమయాలను ఒకేలా అమలు చేయాలని, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఈ వాహనాలు నగరం వెలుపలే నిలువరించాలని నిర్ణయించారు. వారాంతాల్లో మందుబాబులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకోకుండా, మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో ఉమ్మడి తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనదారుల పెం డింగ్ చలాన్ల వసూలు కోసం ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ట్రాఫిక్ విభాగాన్ని ఆదేశించారు.
నెట్‌వర్క్‌ను అనుసంధానించాలి
హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నదని, ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల కట్టడికి మూడు కమిషనరేట్ల మధ్య సమన్వయం అత్యవసరమని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అన్నారు. అధునాతన సాంకేతికత, సీసీటీవీ నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా నేరస్తుల కదలికలను సరైన సమయంలో పసిగట్టవచ్చని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో నేరాల నియంత్రణకు మూడు కమిషనరేట్ల పోలీసులనుంచి ఉమ్మడి బృందాలను ఏర్పాటు చేసి నేరాలను కట్టడి చేయవచ్చని, ఈ దిశగా సమన్వయంతో పనిచేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంలోనూ, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలోనూ సమాచారమార్పిడి చాలా అవసరమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సిటీ అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డేవిస్, గజరావు భూపాల్, డీసీపీలు పాల్గొన్నారు.