Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 22: జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపాటు అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది.
వివరాల్లో కి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నెంబర్ 403 పి లోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని తట్టిఖానా జలమండలి కార్యాలయం పక్కన 1.20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జలమండలి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం 1998లో కేటాయించి పంచనామా చేసి అప్పగించింది. అప్పటినుంచి జలమండలి అధీనంలో ఉన్న సదరు స్థలంలోకి గత కొంతకాలంగా పరశరామ్ పార్థసారథి అనే వ్యక్తి బోగస్ పత్రాలతో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జలమండలికి కేటాయించిన స్థలం తనది అంటూ వాదిస్తున్నాడు. అయితే పార్థసారధి చూపిస్తున్న సర్వే నెంబర్ నాన్ ఎగ్జిస్టింగ్ నెంబర్ అని షేక్‌పేట మండల అధికారులతో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేసింది.
ఇటీవల ఈ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించిన పార్థసారథి వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ వరుస కథనాలతో బట్టబయలు చేయడంతో రెవెన్యూ, జలమండలి అధికారులు రంగంలోకి దిగి స్థలంలో ఆక్రమణలను తొలగించారు. జలమండలికి కేటాయించిన 1.20 ఎకరాల స్థలం చుట్టూ సరిహద్దు రాళ్లు పెట్టుకోవడంతో పాటు స్థలం కబ్జా కాకుండా జలమండలి విజిలెన్స్‌కు చెందిన సిబ్బందిని కాపలా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న పార్థసారథితో పాటు అతడి మనుషులు స్థలం వద్దకు వచ్చి అక్కడ జలమండలి ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించారు.
స్థలం బయట జెండాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడున్న జలమండలి విజిలెన్స్ హోంగార్డు కే.రాఘవేందర్‌కు ఫోన్ చేసిన పార్థసారథి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేశాడు. ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ చేసి ఖరీదైన జలమండలి స్థలం కబ్జాకు యత్నిస్తున్న పార్థసారథితో పాటు అతడికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాత్రి జలమండలి తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు పరశురామ్ పార్థసారథితో పాటు అతడి అనుచరులపై బీఎన్ఎస్ 329(2),303(2),351(4) రెడ్‌విత్ 61(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.