సిటీబ్యూరో: ‘సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో 4 గంటలుగా కరెంటు లేదు. వర్షం ఆగి ఇప్పటికే 2 గంటలైంది. విద్యుత్ తీగలు దెబ్బతినడానికి భారీ గాలులు కూడా లేవు. అయినా.. సరఫరా గంటల తరబడి ఎందుకు నిలిచిపోయింది‘ ఇదీ సుమన్ మిత్ర అనే విద్యుత్ వినియోగదారుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి, టీజీఎస్పీడీసీఎల్ సంస్థకు చేసిన ట్వీట్. ‘ట్విట్టర్ వేదికగా 2 గంటల నుంచి పవర్ కట్కు సంబంధించి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
అయినా మీరు చాలా కూల్‌గా సమాధానం ఇస్తున్నారంటే.. మీ శాఖ యూజ్లెస్ అనుకోవాలి’.. అంటూ ఘాటుగా మరో ట్వీట్‌ను రాత్రి 1.28 గంటల సమయంలో పెట్టాడు. ఇలాంటి ఫిర్యాదులు ఒక్కరి నుంచే కాదు.. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల నుంచి వందలాది మంది కరెంటు లేక గంటల తరబడి ఇబ్బందులు పడ్డామంటూ.. ట్విట్టర్లో పేర్కొన్నారు. గురువారం కురిసిన భారీ వర్షానికి గ్రేటర్లో విద్యుత్ సరఫరా చాలా చోట్ల గంటల తరబడి నిలిచిపోయింది. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు వర్షం కురిసింది. ఆ తర్వాత రాత్రి 2-3 గంటల దాకా సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో నగరవాసులు అసహనం వ్యక్తం చేశారు.
కొమ్మలు తీగలపై పడ్డాయి: సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడక్కడ కొన్ని చోట్ల చెట్లు, వాటి కొమ్మలు విరిగి విద్యుత్ తీగలు, స్తంభాలపై పడటంతో కొద్దిసేపు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉన్న సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టి సరఫరాను సాధారణ స్థితికి తెచ్చారు. నేను స్వయంగా అర్ధరాత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించి పునరుద్ధరణ చర్యలు పర్యవేక్షించా. బంజారాహిల్స్, బైరామల్‌గూడ, బండ్లగూడ, కిస్మత్పూర్, తార్నాక, లంగర్‌హౌజ్ ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. గాలికి ఇతర వస్తువులు లైన్ల మీద పడటం.. ఇన్సులేటర్స్ ఫెయిల్ అవ్వడం వంటి కారణాలతో 19 ఫీడర్లు బ్రేక్ డౌన్ అయ్యాయి.
9910 మెగావాట్లు
డిస్కం పరిధిలో రికార్డు స్థాయిలో శుక్రవారం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు 9910 మెగావాట్ల విద్యుత్ డిమాండు నమోదైందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. కాగా, భారీగా వర్షాలు పడటం, నీటి లభ్యత పెరగడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో వ్యవసాయ రంగంలో డిమాండు భారీగా పెరుగుతున్నదని, 10వేల మెగావాట్లను కూడా దాటే అవకాశమున్నదని అధికారులు వెల్లడించారు.