Hyderabad | వెంగళరావునగర్, మార్చి 9: సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్న ఆ యువకుడి ఆశలతో ఆడుకున్నాడో కేటుగాడు. కన్సల్టెన్సీ పేరుతో మంచి కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. యువకుడి నుంచి రూ.2.25 లక్షలు తీసుకుని అడ్రస్ లేకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన ఎ. సాయికుమార్ (26) బీటెక్ పూర్తిచేశాడు. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ కాలనీలోని హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతనితో డిప్లొమో చేసిన గుంటూరుకు చెందిన జానీ తనకు ఒక కన్సలెంట్ తెలుసని చెప్పాడు. సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానంటే చందు అమర్నాథ్ అనే కన్సల్టెంట్‌కు రూ.2.25 లక్షలు ఇచ్చానని.. నువ్వు కూడా డబ్బులు కడితే జాబ్ వస్తుందని నమ్మించాడు. అమర్నాథ్ను పరిచయం చేశాడు.
అమర్నాథ్తో అన్ని వివరాలు మాట్లాడిన సాయికుమార్.. సాఫ్ట్వేర్ జాబ్ కోసం పలు దఫాలుగా రూ.2.25లక్షలు చెల్లించాడు. డబ్బులు కట్టిన మూడు నెలలకు డికావర్స్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఉద్యోగం ఉందని.. జూమ్ కాల్లో ఇంటర్వ్యూ కూడా చేయించాడు. కానీ ఇంటర్వ్యూలో ఎలాంటి టెక్నికల్ ప్రశ్నలు అడగకపోవడంతో అనుమానం వచ్చి అమర్నాథ్కు సాయికుమార్ చెప్పాడు. అలానా.. అంటూ సాయి మాటలను అమర్నాథ్ దాటవేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు డికావర్స్ టెక్నాలజీ పేరిట ఓ ఆఫర్ లెటర్నుకూడా సాయికి పంపించాడు. ఆ కంపెనీ ఎక్కడ ఉంది? ఎలా ఉంటుందని ఆన్లైన్లో సాయి సెర్చ్ చేయగా ఎక్కడా కంపెనీ డీటెయిల్స్ రాలేదు. అలాంటి కంపెనీ లేదని తెలియడంతో తనకు వచ్చిన ఆఫర్ లెటర్ ఫేక్ అని నిర్ధారించుకున్నాడు. ఇదే విషయంలో అమర్నాథ్ను సాయి నిలదీశాడు. అప్పట్నుంచి అమర్నాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయికుమార్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.