చిక్కడపల్లి, జు లై8 : తెలంగాణలో సమగ్ర సాంస్కృతిక విధానం తీసుకురావాలని పలువరు వక్తలు పిలుపునిచ్చారు. సంస్కృతిని నిర్మించేది ముగ్గురు వ్యక్తులు శాస్త్రజ్ఞుడు, కళాకారుడు, శ్రామికుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణలో సమగ్ర సాంస్కృతిక విధానంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత జస్టిస్ చంద్ర కుమార్ హాజరై మాట్లాడారు. తెలంగాణ పోరాట గడ్డపై విష సంస్కృతి విలయతాండవం చేస్తుందని, దీనికి పిల్లల నుంచి పెద్దల వరకూ బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరు? కాషాయం, కార్పొరేట్ కలిసిపోవడమేనన్నారు.
ఈ సమయంలో మానవీయ విలువలు బోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తక్షణమే కళాకారులతో ప్రచార యాత్రలను చేపట్టాలని కోరారు. తెలంగాణలో జానపద అకాడమీ, బాలల సాహిత్య అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, లలిత కళల అకాడమీ, ఫొటోగ్రఫీ చిత్రకళ అకాడమీ తక్షణమే ఏర్పాటు చేసి.. ప్రత్యేక అధికారి, ప్రత్యేక నిధులు విధులు సమకూర్చాలి అని డిమాండ్ చేశారు. జీ రాములు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, విజ్ఞాన దర్శిని రమేశ్, పీఎన్ మూర్తి, సాంబరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.