మలక్‌పేట, సెప్టెంబర్ 12ః అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. పాత మలక్‌పేట డివిజన్‌కు చెందిన మహ్మద్ జాహెద్(20) గతేడాది అమెరికా కనెక్టికట్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్లో హెల్త్ ఫ్రొఫెషనల్స్ అండ్ రిలేటెడ్ క్లినికల్ సైన్స్ (గాడ్యుయేషన్)విద్యను అభ్యసించేందుకు ఆమెరికాకు వెళ్లాడు. ఈ నెల 7న కనెక్టికట్‌లో కిరాణా సామాను తెచ్చుకునేందుకని మార్ట్‌కు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు మహ్మద్ జాహెద్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహెద్‌ను కనెక్టికట్‌లోని హార్ట్ఫోర్డ్ హెల్త్ కేర్‌లోని సెయింట్ విన్సెంట్ మెడికల్ సెంటర్లో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ, వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా తమ కుమారుడిని చూడటానికి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అనివార్య పరిస్థితుల కారణంగా వెళ్లలేక పోయామని కుమారుడి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం హైదరాబాద్‌కు పంపమని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ను, న్యూఢిల్లీలోని యూఎస్ఏ రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని యూఎస్ఏ కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారులను వేడుకున్నప్పటికీ స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని నగరానికి తెప్పించాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్, సీఎం రేవంత్‌రెడ్డిని వారు కోరుతున్నారు.