KCR | జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్నారి ఓ పాఠశాలకు వినూత్న బహుమతిని అందజేసింది. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో మోటార్ పంప్ కొనిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ శివారు జగద్గిరిగుట్ట పరిధిలోని రంగారెడ్డి నగర్‌కు చెందిన దంపతులు ఆలేటి సురేశ్ గౌడ్, సౌమ్య. వీరి కుమార్తె హైత్వీ గౌడ్ స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సురేశ్ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు కావడంతో ఆ బాలికకు కూడా చిన్నప్పటి నుంచి కేసీఆర్‌పై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పైగా హైత్వీ పుట్టిన రోజు కూడా ఫిబ్రవరి 17నే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో పాటు తన బర్త్ డే అయిన ఫిబ్రవరి 17న వినూత్నంగా ఏదైనా చేయాలని హైత్వీ అనుకుంది. ఈ క్రమంలోనే తన తండ్రికి చెప్పి కిడ్డీ బ్యాంకులో ఉన్న రూ.5వేలను అందజేసింది. దీంతో ఆమె తండ్రి దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మోటార్ పంప్ లేదని తెలుసుకుని.. దాన్ని బహుమతిగా అందజేశారు. చిన్నారి గొప్ప మనసుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నేతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సుధాకర్, యాదిరెడ్డి సుధీర్ గౌడ్ పాల్గొన్నారు.