బంజారాహిల్స్,నవంబర్ 11: ‘నీ భర్త చనిపోయాడు కదా.. కొత్త జీవితం ఇచ్చి పెళ్లి(Marriage) చేసుకోవడంతో పాటు నీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటానని..’ మాయమాటలు చెప్పాడు. రెండేళ్ల పాటు ఆమెను శారీరకంగా వాడుకున్న తర్వాత ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ(36) భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. పెద్ద కొడుకు ఆమె తల్లిదండ్రులవద్ద ఉండగా చిన్నకొడుకు ఆమెతో పాటే ఉంటున్నాడు. కాగా, రెండేండ్ల క్రితం అదే ప్రాంతంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్(28) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
పెళ్లి చేసుకుని నీకు కొత్త జీవితం ఇస్తానంటూ నమ్మబలికాడు. నీ పిల్లలను బాగా చూసుకుంటా అంటూ మాయమాటలు చెప్పడంతో ఆమె ఇమ్రాన్‌కు దగ్గరయింది. మహిళను శారీరకంగా వాడుకున్న ఇమ్రాన్ ఇటీవల ముఖం చాటేయడం ప్రారంభించాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ రెండ్రోజుల క్రితం ఆమె గట్టిగా నిలదీయడంతో నిరాకరించడంతోపాటు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు ఇమ్రాన్ మీద బీఎన్ఎస్ 69, 74 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.