Hyderabad | బంజారాహిల్స్, మే 23: ప్రభుత్వ స్థలం అని బోర్డులు ఉన్నప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదు. స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ గతంలో కేసు నమోదైనా తగ్గడం లేదు. ఏమాత్రం సంకోచించకుండా నిర్మాణ పనులను చేస్తున్నాడు. సదరు బిల్డర్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
హైదరాబాద్ షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం 4 నుంచి దేవరకొండ బస్తీకి వెళ్లే దారిలో ఎఫ్‌కే కన్స్ట్రక్షన్ పేరుతో 600 గజాల స్థలంలో భవన నిర్మాణం చేస్తున్నారు. దీనికోసం జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని బండరాళ్లు తొలగించే పనులు చేస్తున్నారు. కాగా ఆ స్థలానికి ఆనుకుని సుమారు 400 గజాల యూఎల్సీ ల్యాండ్ ఉంది. ఈ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ గత ఏడాది వాటిని తొలగించిన బిల్డర్ మహ్మద్ మిదాత్ మీర్జా.. ఆ స్థలాన్ని కూడా తన స్థలంగానే చూపిస్తూ ఆక్రమించేందుకు యత్నించాడు. ఇద గమనించిన స్థానికులు షేక్‌పేట తహసీల్దార్, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహ్మద్ మిదాత్ మీర్జాపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. అనంతరం ఆ స్థలంలో రెండు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
తనపై క్రిమినల్ కేసు నమోదైనప్పటికీ సదరు బిల్డర్ తీరు మారలేదు. కొంతకాలంగా మరోసారి స్థలంలోకి చొచ్చుకొచ్చి పనులు చేయిస్తున్నాడు. ఆ స్థలంలో సెల్లార్ కోసం తవ్వకాలు జరపడంతో పాటు బండరాళ్లను నింపేశాడు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులున్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులు పనులు నిర్వహిస్తుండటంతో స్థానికులు శుక్రవారం నాడు షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ అనితారెడ్డి హామీ ఇచ్చారు.