Ganesh Laddu | హైదరాబాద్ : గణనాథుడి లడ్డూకి భలే క్రేజ్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఈ లడ్డూ వేలం పాటలో కోట్లు, లక్షల రూపాయాల్లో పలుకుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో గణేషుడి లడ్డూ మాత్రం కేవలం డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. అక్షరాలా రూ. 99కే 333 కిలోల లడ్డూను ఓ విద్యార్థి దక్కించుకున్నాడు.
కొత్తపేటలోని శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో రూ.99కే 333 కిలోల లడ్డూను బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ దక్కించుకున్నాడు. లడ్డూ లక్కీ డ్రా కోసం 760 టికెట్లను నిర్వాహకులు విక్రయించారు.
కాగా ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో గణనాథుడి లడ్డూ వేలం పాటల్లో అత్యధిక ధర పలికినవి ఇవే.. బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లావాసులు రూ.2,31,95,000 పైగా చెల్లించి గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో రూ. 51.77 లక్షలు పలుకగా, బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ. 35 లక్షలు పలికింది.