Hyderabad | బంజారాహిల్స్, సెప్టెంబర్ 7 : అర్థరాత్రి వేళ ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన కొబ్బరి బొండాల దుకాణంలోకి చొరబడ్డాడు. ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 14లో కేబీఆర్ పార్కుకు సమీపంలోని ఖాళీ స్థలంలో ఎన్నోఏళ్లుగా చిరువ్యాపారులు కొబ్బరి బొండాలు, పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రిపూట వాటి చుట్టూ కవర్లు కట్టేసి వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన ఓ ఆటోడ్రైవర్ అర్థరాత్రి దాటిన తర్వాత అక్కడకు వచ్చి కొబ్బరి బొండాల మీదనున్న పాలిథీన్ షీట్‌ను తొలగించి వాటిని తస్కరించి ఆటోలో పెట్టుకుని ఉడాయించాడు. ఇప్పటికే రెండుమూడుసార్లు ఇదే విధంగా కొబ్బరి బొండాలు చోరీ కావడంతో అక్కడున్న సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. సుమారు 300 దాకా కొబ్బరి బొండాలు పోయాయని తెలుస్తోంది. కాగా ఈ వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు.