సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : నగరంలో జలం రోజురోజుకు ఖరీదవుతున్నది. జూన్‌లో వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో నీటి సమస్య రెట్టింపు అయింది. మొన్నటి వరకు నీటి ట్యాంకర్ ధర రూ.4,600కు విక్రయించగా, ఇప్పుడు రూ. 9,600లకు పాకింది. నీళ్ల ట్యాంకర్ బుక్ చేస్తే అది రెండు, మూడు రోజుల్లో ఎప్పుడొస్తదో కూడా తెలియని దుస్థితి నెలకొంది.
జూన్ చివరికి వచ్చినా వర్షాలు ఆశించిన స్థాయిలో పడటం లేదు. సరాసరి 2 సెం.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో వేసవిలో అడుగంటిపోయిన భూగర్భ జలాలు ఇంకా పెరగలేదు. దీంతో నీళ్ల ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. ఇదే అదునుగా ట్యాంకర్లు సరఫరా చేసే వారు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్‌కు రూ. 10వేల వరకు డిమాండ్ ఉందని స్థానికులు చెబుతున్నారు.