Hyderabad | మేడ్చల్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): వేసవి కాలంలో కూరగాయలు విరివిగా పండించే ప్రణాళికను ఉద్యానశాఖ సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి వేసవి కాలంలో 95శాతం హైదరాబాద్ పట్టణ ప్రజలకు కూరగాయలను అందించే విధంగా ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కూరగాయలను పండించేందుకు రైతులను ప్రోత్సహించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యానశాఖ కూరగాయల నారును రైతులకు సబ్సిడీపై అందించనుంది. మార్చి నుంచి జూన్ వరకు కూరగాయలు పండించేలా ఉద్యానశాఖ నిర్ణయించింది. హైదరాబాద్ నగరానికి జిల్లా సమీపంలో ఉండి మార్కెట్కు ఎలాంటి ఇబ్బంది ఉండందన్న నేపథ్యంలో కూరగాయల విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
రైతులను ప్రోత్సహించేలా కూరగాయల నారును సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్నది. రైతులు పండించే కూరగాయల వివరాలను ఉద్యానశాఖకు సమాచారం అందిస్తే నారు సిద్ధం చేసి రైతులకు సరఫరా చేసుంది. ఇందులో సబ్సిడీపై టమాట, వంకాయ, మిర్చి, క్యాప్సికం, దోసకాయ, కాకరకాయ తదితర పంటల నారును అందించనున్నారు.
కూరగాయల నారును ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయల సాగులో రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఉద్యానశాఖ సిద్ధంగా ఉంది. కూరగాయల సాగును పెంచేలా ప్రోత్సహిస్తున్నాం.
-జిల్లా ఉద్యానశాఖ అధికారి, నీరజా గాంధీ