సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డ మానసిక రోగుల వైద్యశాలలో రెండు రోజుల క్రితం ఫుడ్ ఫాయిజన్ కారణంగా ఒకరు చనిపోగా, 92 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో 18 మందిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందించగా, మిగతావారికి ఎర్రగడ్డ దవాఖానలోనే వైద్యసేవలందిస్తున్నారు.
డైటీషియన్ లేకపోవడం, హెచ్‌డీఎంసీ పర్యవేక్షణ లేనికారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే కేవలం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో మాత్రమే డైటీషియన్ల కొరత ఉందనుకుంటే పొరపాటు. నిత్యం పేదప్రజలకు వైద్యసేవలందించే మెజార్టీ ప్రభుత్వ దవాఖానాల్లో సైతం డైటీషియన్ల కొరత వెంటాడుతోంది. నిలోఫర్, ఉస్మానియా, సుల్తాన్‌బజార్‌లోని మెటర్నిటీ దవాఖాన, పేట్లబుర్జ్ ఆసుపత్రుల్లో ఛీప్ డైటీషియన్, డైటీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో నిరంతర పర్యవేక్షణ..
ప్రభుత్వ దవాఖానాల్లో చేరే ఇన్పేషెంట్లందరికీ ఉచితంగా మూడు పూటల పోషకాహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేసి, ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత భోజనం అందించేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వాటిలో పోషకాలతో కూడిన ఆహారాన్ని రోగికి అందించేందుకు డైటీషన్లను నియమించారు.
గత పదేళ్లు డైటీషియన్ల పర్యవేక్షణలో నిరంతరం రోగికి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారాన్ని తగిన మోతాదులో అందించేవారు. కిచెన్ పరిశుభ్రత, ఆహారం తయారు చేసే సందర్భంలో పరిశుభ్రమైన నీటిని వాడటంలో డైటీషియన్ తప్పనిసరిగా పర్యవేక్షిస్తుండేవారు. సాధారణ వ్యాధులతో పాటు డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి ప్రత్యేక ఆహార నియమాలు సూచిండటం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవవాలనేది కూడా కుటుంబ సభ్యులకు డైటీషియన్లే తెలియజేసేవారు.
హెచ్‌డీఎంసీ పర్యవేక్షణేది..?
రోగులకు అందించే ఆహారం నాణ్యత, రుచి ఉండేలా నిత్యం పర్యవేక్షించేందుకు ప్రతి ఆస్పత్రిలో హాస్పిటల్ డైట్ మేనేజ్మెంట్ కమిటీ (హెచ్‌డీఎంసీ) తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్‌గా వ్యవహరించగా, ఆర్ఎంఓ, డైటీషియన్, పరిపాలనాధికారి, హెడ్ నర్సు, ఫార్మసిస్టు, పేషెంట్ వెల్ఫేర్ రిప్రజెంటేటివ్ తరుఫున ఒకరు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. క్యాంటీన్ టెండర్లు, కిచెన్ పర్యవేక్షణ, రుచి, నాణ్యత, ఫిర్యాదుల నేపథ్యంలో కాంట్రాక్టర్‌పై చర్యలు, రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్, సరుకుల వివరాలు వంటి కార్యకలాపాలన్నీ హెచ్డీఎంసీనే చూడాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ జిల్లాలోని ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా హెచ్‌డీఎంసీ పర్యవేక్షణ లేకపోవడంతో రోగులకిచ్చే డైట్ సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు.
మెజార్టీ ఆస్పత్రుల్లో ఖాళీగా పోస్టులు
ప్రస్తుతం నగరంలోని నిత్యం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఉండే 1200 మంది ఇన్‌పేషెంట్లు, నిలోఫర్‌లో 300 ఇన్‌పేషెంట్లు, కోఠి మెటర్నిటీలో 200 మంది ఇన్‌పేషెంట్లు, ఎర్రగడ్డలో 340 మంది ఇన్‌పేషెంట్లు తినే ఆహారాన్ని ఆయా ఆసుపత్రుల్లో ఉండే డైటీషియన్లే పర్యవేక్షించడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నీటీ, పేట్లబుర్జ్ ఆసుపత్రుల్లో ఉన్న చీఫ్ డైటీషియన్, డైటీషియన్లు బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు వారి స్థానంలో రెగ్యులర్ వారిని నియమించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఉస్మానియాలో కాంట్రాక్ట్ పద్దతిలో డైటీషయన్ నియామం కాగా, నిలోఫర్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్, ఆర్ఎంవో స్థాయి అధికారులే అడపాదడపాగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.
భయపడుతున్న రోగులు
ఆస్పత్రుల్లో రెగ్యులర్ డైటీషన్లను నియమించకపోవడంతో.. నిత్యం నాణ్యతలేని, పోషకాలు లోపించిన తిండిని తింటూ రోగులు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ తిండి తింటే మరిన్ని రోజులు ఆస్పత్రిలోనే గడపాల్సి వస్తుందని భయపడి చాలా మంది రోగులు ఆ భోజనాన్ని తినకుండా చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టి బయటినుంచి తెప్పించుకొని తింటున్నారు. వైద్య సేవల్లో ఎంతో ప్రాముఖ్యత గాంచిన ఉస్మానియా, నిలోఫర్, ప్రభుత్వ మెటర్నిటీ వంటి ఆసుపత్రుల్లో డైటీషియన్లు లేకపోవడం మూలానా రోగుల అరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీలైనంత మేరకు రెగ్యులర్ చీఫ్ డైటీషియన్లు, డైటీషియన్ పోస్టులను భర్తీ చేయాలంటూ రోగుల సహాయకులు కోరుతున్నారు.