Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 25: పెళ్లయ్యి 20 ఏండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి చేయకూడని పని చేశాడు. ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల పక్కన పడుకున్న 8 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలని అనుకున్నాడు. పిల్లాడు ఎడ్వకుండా ఉండేందుకు ముందుగానే తనతో తెచ్చుకున్న పాలడబ్బాను చిన్నారికి ఇచ్చి మరీ కిడ్నాప్ చేశాడు. అయితే బాధిత తల్లిండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. బాబును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ చెందిన కలివల గీత, రాదే ఉపాధి కోసం కొద్ది నెలల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చారు. సనత్‌నగర్‌లోని ఫతేనగర్ శివాలయం రోడ్డులో చెత్త ఏరుకుంటూ జీవనం పొందుతున్నారు. వీరికి శివమ్(8 నెలలు)తో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నారు. కాగా, ఈ నెల 22న రాత్రి ఫతేనగర్ శివాలయం రోడ్డుపై విపిన్ ఇండస్ట్రీస్ షట్టర్ ముందు ఫుట్‌పాత్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి పడుకున్నారు. ఈ క్రమంలో రాత్రి 2.30 గంటల సమయంలో శివమ్‌ను ఎవరో అపహరించారు. ఈ క్రమంలో పిల్లాడు ఏడవకుండా ఉండేందుకు ముందుగానే తెచ్చుకున్న పాల డబ్బాను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా, ఇరుగుపొరుగును విచారించినప్టపికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తమ కొడుకును ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఈ నెల 23వ తేదీన సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించారు. విచారణ జరపగా నిందితులు బిహార్‌లోని చాప్ర జిల్లాకు చెందిన సత్యనారాయణ రామ్ (43), సన్నీ కుమార్ పాండే (24)గా గుర్తించారు. సత్యనారాయణ బాలానగర్ గౌతమ్ నగర్లో ఉంటూ ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్నారు.
ఈ క్రమంలో నిందితులను పట్టుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్యనారాయణ రామ్‌కు పెళ్లయ్యి 20 ఏండ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ పిల్లలు మాత్రం పుట్టలేదు. దీంతో తాను వచ్చిపోయే మార్గంలో బాలుడిని గమనించి ఎత్తుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సత్యనారాయణ తెలిపాడు. నిందితుడు పారిపోతుండగా పట్టుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి 24 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులను ఈ సందర్బంగా అభినందించారు.