సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని పోలీసు అధికారులు పదేపదే చెబుతారు. సీసీ పుటేజి ఆధారంగా కీలకమైన కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. నేరం చేసి తప్పించుకునే దోషులను సీసీ కెమెరాలు పట్టిస్తున్నాయి. కాగా మహానగరంలో 70శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీనికి పర్యవేక్షణ లోపం ఒక కారణం కాగా మరో ముఖ్యమైన కారణం ఇటీవల టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇతర కేబుళ్లను తొలగించడంలో సీసీ కేబుల్స్కూడా తొలగించారు.
దొంగను గుర్తించాలన్నా.. దోపిడీ ముఠాల ఆట కట్టించాలన్నా.. సీసీ కెమెరాల పాత్ర కీలకం. హైదరాబాద్ భద్రతను పహారా కాసే నిఘా కళ్లు నిద్రపోతున్నాయి. సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు నగరంలో ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా తమకు సమాచారం తెలియాలని, నేరాల నియంత్రణకు ఉపయోగంగా ఉంటుందని భావించి సీసీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
కొంతకాలంగా ఈ కెమెరాల నిర్వహణను అటు నిర్వాహకులు కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో మూలకుపడ్డాయి. మరోవైపు విద్యుత్ స్తంభాలపై ఉన్న అక్రమ తీగలను తొలగించే సమయంలో సీసీటీవీ కెమెరా వైర్లను కూడా కత్తిరించడంతో అవి పనిచేయకుండా పోయాయి.
గతంలో 9 లక్షల సీసీలు..
పారిశ్రామికంగా హైదరాబాద్ మహానగరం అగ్రభాగాన ఉండాలంటే అందుకోసం శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నగరంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ మహానగరంలో దాదాపు 9 లక్షల వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే అందులో కనీసం 30 శాతం కూడా పనిచేయడం లేదు. 2021నాటికి దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది.
నగరంలోని ప్రతి వెయ్యిమంది ప్రజలకు 30 సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేయడంతో చదరపు కిలోమీటర్‌కు 480 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లండన్, బీజింగ్, న్యూయార్స్ నగరాలను అధిగమించిన సిటీగా ప్రపంచంలోనే భాగ్యనగరం రెండోస్థానాన్ని సంపాదించుకుంది. ఇదంతా గతంలో సాధించిన కీర్తి కాగా ఇప్పుడా పరిస్థితి నుంచి అధ్వాన్నస్థితికి వచ్చింది.
కేబుళ్ల తొలగింపుతో
ఇటీవల రామంతాపూర్‌లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో దక్షిణ డిస్కం అధికారులను ప్రభుత్వం స్తంభాలకున్న కేబుల్స్ తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది స్తంభాలకున్న ఇతర తీగలు తొలగించారు. వీటిలో సీసీటీవీ కెమెరా తీగలున్నట్లు సమాచారం. ఈ ప్రభావంతో పలు పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగే అంశాలను గుర్తించలేని దుస్థితి ఏర్పడింది. విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్నాయని తొలగించిన తీగల్లో పది నుంచి పదిహేను శాతం సీసీ కెమెరాల వైర్లు ఉండడంతో ప్రస్తుతం పనిచేస్తున్నవి కేవలం 30శాతం మాత్రమే పనిచేస్తున్నాయని పోలీసుల అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ పరిధిలో ఆరువేల కెమెరాల్లో 2500 మొరాయించాయి. స్తంభాలకున్న తీగలను తొలగించడంతో మరో 700 పనిచేయకుండా అయ్యాయి. శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు దర్యాప్తుపై వీటిప్రభావం తీవ్రంగా పడుతోంది. కొద్ది రోజుల క్రితం నగరంలోని కీలక ప్రాంతంలో చోరీ జరిగింది. దొంగలను గుర్తించేందుకు పోలీసులు 50కిపైగా సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. అందులో కేవలం నాలుగు మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు.
కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కెమెరాల్లో అధికశాతం మరమ్మతులకు గురయ్యాయి. కొన్నిచోట్ల గంజాయి బ్యాచ్, సెల్‌ఫోన్ స్నాచర్లు తీగలు కత్తిరించారు. ఇందులో 46శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో అనుమానితులను గుర్తించేందుకు కెమెరాలు ఉపకరించేవి. గతేడాది 41 రోడ్డు ప్రమాదాలు, 21 సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు, 5 హత్యలు, 4 కిడ్నాప్‌లు, 2 అత్యాచారఘటనలతో సహా 123 ఘటనలను సీసీ ఫుటేజి ఆధారంగా పోలీసులు ఛేదించారు.