EV Bus | నగరంలోని రాణిగంజ్ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేటలో బస్సులు నడుస్తున్నాయన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, శ్రామిక్, ఇతర సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని.. వారందరికీ అభినందనలు చెప్పారు. ఇప్పటికీ 251 కోట్ల మంది మహిళలు.. రూ.8,500 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారన్నారు. హాస్పిటల్స్, దేవాలయాలు, ఉద్యోగులు, బంధువుల ఇంటికి, స్కూళ్లకు రాకపోకలు సాగించారన్నారు.
దాంతో దేవాదాయ శాఖ ఆదాయం మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిందన్నారు. రెండేళ్లలో ప్రస్తుతమున్న 40శాతం బస్సులను కొనుగోలు చేయడం జరిగిందని.. ఆర్టీసీలో కొత్త రక్తం వస్తుందన్నారు. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్స్ వస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానుల చేసిందన్నారు. ఢిల్లీ లో నివాస యోగ్యం లేకుండా కాలుష్యం ఉన్న పరిస్థితి ఉందని.. ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుందన్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న అనేక అంశాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రయాణికులకు సౌకర్యంగా ఈవీ బస్సులు సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం, యాదాద్రికి రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రత్యేక బస్సులు బస్సులు, నూతన బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. 1932లో ప్రారంభించిన ఆల్బియన్ బస్సు, మధ్యలో వచ్చిన ఎర్రబస్సు, ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినట్లు చెప్పారు. ఎర్పోర్ట్లో ఇబ్బందులు వచ్చినా దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపినట్లు చెప్పారు. ప్రజారవాణాలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని.. ఈవీ బస్సుల ప్రారంభోత్సవంతో నగరంలో మరింత మెరుగ్గా బస్సులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఈవీ పాలసీని తీసుకువచ్చామని.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా నగర ప్రజలకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు.