సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు అమ్మినప్పటికీ కొడుకులు కొత్త పాసుపుస్తకాలు సృష్టించుకొని పాత లే అవుట్లను చెరిపేసి సాగు చేసుకుంటున్నారని పలువురు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు చేశారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రజావాణిలో 63 ఫిర్యాదులు రాగా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. తుర్కయాంజల్ చెరువులోకి వెళ్లే వాననీటికి అడ్డంగా గోడ కట్టడంతో వరద తమ కాలనీని ముంచెత్తుతున్నదంటూ ఏవీనగర్ 2 నివాసితులు ఫిర్యాదు చేశారు.
ఘట్కేసర్ మండలం ప్రతాప్సింగారంలో 25.17 ఎకరాల్లో 390 ప్లాట్లతో 1989లో లే అవుట్ చేయగా.. అందులో 88 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని, మొత్తం 6.14 ఎకరాల భూమి తనదంటూ ధరణి ద్వారా పాసుపుస్తకాన్ని సృష్టించి కబ్జా చేశారంటూ ప్లాట్లు కోల్పోయిన వారు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి మండలం బోడుప్పల్‌లోని దేవేందర్‌నగర్ కాలనీ సర్వే నెంబర్ 63బై 1 లోని 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ స్థానికులు విన్నవించారు. వీటిపై త్వరలోనే విచారణ జరుపుతామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.