సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ ఉపయోగించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 3వ తేదీ నుంచి 9 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత లోపించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం, వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.
ఈ వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ వాడుతున్న 6,046 మంది నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 5,810 మంది ద్విచక్రవాహనదారులు, 51 మంది త్రీ వీలర్ డ్రైవర్లు, 185 మంది కార్లు ఇతర వాహనదారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చార్జిషీట్లు దాఖలు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని చట్టప్రకారం జరిమానాలు విధిస్తామని పోలీసులు తెలిపారు.