సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన, పోయిన 60 సెల్ఫోన్లను రికవరీ చేసిన సైబరాబాద్ ఐటీ సెల్ పోలీసులు మంగళవారం బాధితులకు తిరిగి అప్పగించారు. చోరీ, పడిపోవడం, మిస్సింగ్ తదితర కారణాలతో సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సెంట్రల్ ఇక్విప్మెంట్ ఐడెంటీటీ రిజిస్టార్(సీఈఐఆర్) పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్ పరిధిలో 20 రోజుల్లో చోరీ, మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కె.నర్సింహ తెలిపారు.
టెలికమ్యూనికేషన్ శాఖ అందుబాటులోకి తెచ్చిన సీఈఐఆర్ పోర్టల్ మే 17, 2023 నుంచి పనిచేస్తుందన్నారు. సెల్ఫోన్ పోయిన బాధితులు సీఈఐఆర్, ఎన్సీఆర్పీ పోర్టల్, 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు ఈ సెల్ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్సై రూప ఇతర ఐటీసెల్ సిబ్బంది పాల్గొన్నారు.