TGS RTC | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల సంక్షేమార్థం ఆర్టీసీకి పోలీస్, రవాణాశాఖలు సహకరించాలని కోరారు. దసరా ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో సోమవారం సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. టీజీఎస్ఆర్టీసీలో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని, అందుకే ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు.
ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ‘మహాలక్ష్మి’ పథకం దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, బోయిన్పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్‌సదన్, బోరబండ, శంషాబాద్‌లో ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. జేబీఎస్ నుంచి 1,602, ఎల్బీనగర్ నుంచి 1,193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘర్ నుంచి 451అదనపు బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. తిరుగు ప్రయాణం రద్దీ దృష్ట్యా 13, 14 తేదీల్లోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ముందస్తు రిజర్వేషన్ కోసం tgsrtcbus.inలో బుక్ చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పండుగ వేళల్లో టీజీఎస్ఆర్టీసీకి తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు శ్రీనివాసులు, మనోహర్, ట్రాఫిక్ అదనపు డీసీపీలు వీరన్న, మాజిద్, ఆర్టీఏలు వాణి, పురుషోత్తంరెడ్డి, సుభాష్‌రెడ్డి, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్‌కుమార్, ఆర్ఎంలు శ్రీలత, వరప్రసాద్, కేఎస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.