సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.1.50 కోట్ల విలువ చేసే 570 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, సంబంధిత యజమానులకు అందజేశారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కె.నర్సింహ కేసు వివరాలు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది గడిచిన 8 నెలల్లో మొత్తం 2,696 సెల్ఫోన్లు రికవరీ చేశామన్నారు.
అందులో గత మూడు నెలల్లో 1200 ఫోన్లు రికవరీ చేసినట్లు డీసీపీ వివరించారు. ఈ 1200 ఫోన్లలో రూ.1.50 కోట్ల విలువైన 570 సెల్ఫోన్లను గడిచిన 25 రోజుల్లోనే రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. గత మూడు నెలల్లో రికవరీ చేసిన 1200 సెల్ఫోన్లలో మాదాపూర్ సీసీఎస్ పోలీసులు 101ఫోన్లు, రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు 87ఫోన్లు, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు 100ఫోన్లు, మేడ్చల్ సీసీఎస్ పోలీసులు 95ఫోన్లు, బాలానగర్ సీసీఎస్ పోలీసులు 97ఫోన్లు, 90 ఫోన్లు ఐటీ సెల్ పోలీసులు రికవరీ చేసినట్లు డీసీపీ వివరించారు.
ఈ రోజుల్లో సెల్‌ఫోన్ అనేది నిత్య జీవితంలో భాగమైపోయిందని, సెల్‌ఫోన్ పోయిన వెంటనే యజమానులు నిర్లక్ష్యం చేయకుండా స్థానిక పోలీసులకు లేదా సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోయిన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతికి దొరికితే దుర్వినియోగం అవడంతో పాటు ఇతర సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని డీసీపీ హెచ్చరించారు.
పోయిన ఫోన్లను రికవరీ చేసి ఇచ్చినందుకు ఆ ఫోన్ల యజమానులు సైబరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్స్ ఏసీపీ కళింగరావు, సీసీఎస్ ఏసీపీ కె.శశాంక్‌రెడ్డి, రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజు, మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ నర్సింహ, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ శశిధర్, ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ జెమ్స్ బాబు, సీసీఎస్ మాదాపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.