Ganja | మారేడ్‌పల్లి, ఏప్రిల్ 10 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7వ నంబర్ ప్లాట్ ఫారంలో రూ. 26 లక్షల విలువ చేసే 52 కేజీల ఎండు గంజాయి బ్యాగులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్సీ ఎస్ఎన్ జావెద్, ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్పలతో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రైల్వే స్టేషన్‌లోని 7వ నంబర్ ప్లాట్ ఫారంలో ఈ నెల 9వ తేదీన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. నాలుగు భారీ బ్యాగులు అనుమానాస్పదంగా అక్కడ ఉన్నాయి. ఆ బ్యాగుల వద్ద ఎవరు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది . వెంటనే ఆ బ్యాగులను ఓపెన్ చేసి చూడగా అందులో గంజాయి ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే రైల్వే సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న పలువురిని, స్టాల్స్ వ్యాపారులను ఈ బ్యాగ్‌ల గురించి ఆరా తీయగా ఏలాంటి సమాచారం లభించలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా రైల్లో అక్రమంగా నిందితులు వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని రైల్వే డిఎస్పీ జావేద్ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.