బంజారాహిల్స్, సెప్టెంబర్ 9: జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో సుమారు 500 గజాల ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రి దగ్గర బంధువు అంటూ దబాయిస్తున్నారు. షేక్‌పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ప్లాట్ నెం 25 వెనకాల బండరాళ్లతో కూడిన ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. దీనిలో సుమారు 371 గజాల స్థలాన్ని బోగస్ పత్రాలతో 2008లో జీవో 166 కింద ప్లాట్ నెం 25 యజమాని మదన్‌మోహన్‌రెడ్డి క్రమబద్ధీకరించుకోగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిబంధలను ఉల్లంఘించినట్లు గుర్తించి క్రమబద్ధీకరణను 2019లో రద్దు చేసింది. కొన్నాళ్ల తర్వాత తప్పుడు పత్రాలతో లే అవుట్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్) ప్రొసీడింగ్స్ ఉన్నాయంటూ జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చి తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు.
వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా రెండు నెలల క్రితం షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది అడ్డుకుని ఆక్రమణలను కూల్చేశారు. ఇటీవల మరోసారి తన ఇంటి వెనుకున్న సుమారు 500 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు నిర్మాణాలు ప్రారంభించిన మదన్ మోహన్‌రెడ్డి వ్యవహారంపై స్థానిక నేతలు సుధాకర్‌రెడ్డి తదితరులు షేక్‌పేట మండల అధికారులకు ఫిర్యాదులు చేశారు. తనకు రాష్ట్రంలోని కీలకశాఖకు చెందిన మంత్రి ఆశీస్సులున్నాయని, తనజోలికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదంటూ సదరు నిర్మాణదారుడు దబాయిస్తుంటారని తెలుస్తోంది. సుమారు రూ.15కోట్ల విలువైన ఈ స్థలం వ్యవహారంపై వెంటనే కలెక్టర్‌తో పాటు స్థానిక రెవెన్యూఅధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.