కందుకూరు/ మహేశ్వరం, ఆగస్టు 27 : నా బలం, బలగం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని దెబ్బడగౌడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగౌడ, గ్రామాలకు చెందిన దాదాపు 400మంది కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుండె పర్వతాలు, సీనియర్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని ప్రజలకు కల్లబొల్లి మాటలను చెప్పి నమ్మించాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ అని.. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే సీఎం ఎవరని ప్రశ్నించారు. ఆ పార్టీలు గెలిస్తే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, యువజన విభాగం అధ్యక్షుడు విఘ్నేశ్వర్రెడ్డి, సర్పంచులు గోవర్ధన్, రాంచంద్రారెడ్డి, మహేశ్, మాజీ సర్పంచ్ జంగయ్య, ఎంపీటీసీ ఇందిరమ్మ దేవేందర్, అంజయ్యగౌడ్, క్రిష్ణారాంభూపాల్రెడ్డి, డైరెక్టర్ దేవీలాల్ నాయక్, అంజయ్య, పాండు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.